అనుకున్నదే జరిగింది. రాష్ట్రంలో కాస్త రాజకీయ అవగాహన ఉన్న వారెవరికైనా ప్రజారాజ్యం కాంగ్రెస్ తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోబోతుందో తెలుసు. వారి ప్రతి కదలికలోనూ తడబాటు స్పష్టంగా కనబడుతున్నప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజారాజ్యం మద్దతివ్వదని ఎవరూ భావించలేదు. మద్దతే కాదు..రేపు ప్రభుత్వంలో చేరినా, ఆ తరువాత కాంగ్రెస్ లో విలీనమైనా అంతగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఎవరికీ లేదు. పిఆర్ పి తీసుకోబోయే నిర్ణయాల పట్ల ఆశ్చర్యమైతే లేదు గానీ, ఎందరో ఆశలను చిదిమివేసిన వైనంపైనే ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా చిరంజీవి అభిమానుల్లో, పార్టీ కార్యకర్తల్లో, ఈ రాష్ట్రంలో ప్రజారాజ్యం రూపంలో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ ఆవిర్భవించిందని కలలు గన్న వాళ్ళకు మాత్రం `ఆ పార్టీ` ఆశనిపాతంలా మారింది.
-టాలీవుడ్ లో తిరుగులేని హీరోగా, మెగాస్టార్ గా మూడు దశాబ్దాల పాటు వెండితెరపై మెరిసిపోయిన చిరంజీవి నటించాడు తప్ప ఏ చిత్రానికి దర్శకత్వం వహించలేదు. రాజకీయల్లోనూ చిరంజీవి పాత్రధారణకు పరిమితమై కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వాన్ని ఇతరులకు అప్పగించారు. నిన్నటిదాకా బావమరిది అల్లు అరవింద్ ఆ పనిచేస్తే ఇపుడు ఏకంగా కాంగ్రెస్ పార్టీ చిరంజీవి వేలు పట్టుకుని నడిపించే పని చేస్తోంది. కాంగ్రెస్, ప్రజారాజ్యంల మధ్య భావ సారూప్యత ఉందని ప్రకటించిన చిరంజీవి `రాజ్యసభ` సీటులోనూ ఆ సారూప్యత ఉంటుందని భావించి భంగపడ్డారు. రాజ్యసభ కాదు….రాష్ట్ర మంత్రివర్గంలో చేరమంటూ కాంగ్రెస్ నుంచి పిలుపొచ్చింది. నాలుగు మంత్రి పదవులు, రెండు ఎమ్మెల్సీలు కూడా ఇస్తామని…చిరంజీవి భాషలో చెప్పాలంటే కాంగ్రెస్ ఆఫర్ చేస్తోంది. మరో నాయకుడు భాషలో చెప్పాలంటే ప్రజారాజ్యానికి కాంగ్రెస్ `గుడ్ విల్` ఇస్తానంటోంది. ఆఫర్లు, గుడ్ విల్స్ పైన తీవ్ర స్థాయిలో చర్చ జరిగిన తరువాతే, తెరచాటు ఒప్పందాలు కుదిరిన తరువాతే రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతిస్తామని ప్రజారాజ్యం ప్రకటించింది.
- 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యానికి 70 లక్షల ఓట్లు వచ్చాయి. 17 శాతం ఓటు బ్యాంకు పిఆర్ పి ఖాతాలో జమైంది. వీళ్ళ వల్లే ఓడామని తెలుగుదేశం గగ్గోలు పెడుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో విస్మరించటానికి వీల్లేని స్థాయిలో ప్రజారాజ్యానికి చోటు దక్కింది. మరి, ప్రజలు ప్రజారాజ్యానికిచ్చిన ప్రాధాన్యతనను ప్రజారాజ్యం ప్రజల కిస్తోందా…! కాంగ్రెస్ తో పొత్తును నీతిబాహ్యమైన చేష్టలుగా భావిస్తున్న ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, ఓటర్ల మనోభావాలను చిరంజీవి పరిగణలోకి తీసుకున్నారా? పొత్తు రాజకీయాలు, సంకీర్ణ ప్రభుత్వాలు దేశంలో కొత్తేమీ కాదు. అయితే, ఆ పొత్తులు దేని కోసం, ఎందుకోసం, ఎవరి ప్రయోజనాల కోసం. ఏ సందర్భంలో పెట్టుకుంటున్నారని చర్చ వచ్చినపుడు మాత్రం ఆయా పార్టీల నైతికత, విశ్వసనీయత, ఇప్పటిదాక ఆయవల్లెవేసిన రాజకీయ నీతి చంద్రికలు జ్ఞాపకమొస్తాయి. `మార్పు` కోసం వచ్చామన్నారు. సామాజిక న్యాయమే ధ్యేయమని చెప్పారు. అవినీతి రహిత సమాజ నిర్మాణమే తమ లక్ష్యమని ప్రకటించారు. కానీ ఇపుడేం చేస్తున్నారు? ఏ ప్రధాన పార్టీకయితే ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో ప్రజారాజ్యాన్ని స్థాపించారో, ఏ పార్టీనయితే అవినీతి కూపంగా తిట్టిపోశారో ఆ పార్టీతోనే అంటకాగేందుకూ, అవసరమైతే తన పార్టీనే అందులో విలీనం చేసేందుకు పథకం సిద్ధం చేసుకున్నారు. దేనికయినా ఆయన సిద్ధమే, కాకపోతే `ఆఫర్` మీదనే చర్చలు జరుగుతున్నాయి. ముందుగా ఆశపడ్డట్టు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినట్టయితే బావ మరిదిని సంతృప్తి పెట్టి ఉండే వారు. మరి, మంత్రివర్గంలో చేరమంటే ఎవరిని సంతృప్తి పరచాలి? మంత్రివర్గంలో చేరటం వల్ల తమ కుటుంబానికి జరిగే లాభమేమిటి? మంత్రివర్గంలో చేరిన వాళ్లంతా చిరంజీవి కనుసన్నల్లో నడుస్తారన్న నమ్మకం ఏమిటి? ఒకసారి పొత్తు పెట్టుకున్నాక అసలు చిరంజీవి అవసరమే లేకుండా ఎమ్మెల్యేలందరినీ తమ వైపుకు తిప్పుకుంటే అప్పుడేం చేయాలి? మంత్రి పదవులు రాని వాళ్ళు చిరంజీవిపై బహిరంగ విమర్శలు చేసి మారుతున్న రాజకీయ సమీకరణల్లో జగన్ పక్షం చేరితే పరిణామాలు ఎలా ఉంటాయి? పార్టీ ఏమై పోయినా పర్వాలేదు…కాంగ్రెస్ తో పొత్తు, విలీన రాజకీయ సయ్యాటల ద్వారా తమ కుటుంబ సభ్యులకు జరిగే ప్రయోజనమేమిటనే విషయంపైనే ఇపుడు చర్చలు జరుగుతున్నాయి. రెండు ఎమ్మెల్సీల ఆఫర్ కూడా ఉంది గనుక అల్లు అరవింద్ ను ప్రమోట్ చేసి మంత్రి వర్గంలో స్థానం కల్పించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏది ఏమైనా పొత్తుతోనో, విలీనంతోనో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో మమేకం కావటం మాత్రం తధ్యం. మరి, ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలేమై పోవాలి? జిల్లాల్లో పార్టీని నడిపిస్తున్న నాయకులు, మిగతా శ్రేణులు ఏం కావాలి? ఈ రాష్టంలో కాంగ్రెస్, టీడీపియేతర ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం పరితపించి ఆశాదీపంలా కనిపించిన చిరంజీవి వెంట నడిచిన వారి దారీతెన్నూ ఏమిటి? కోస్తా జిల్లాల్లో ప్రజారాజ్యం భుజాన కాసిన చిరంజీవి సామాజికవర్గం ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటుందో ఆయనెపుడైనా ఆలోచించారా? కోస్తా జిల్లాల్లో కాపు సామాజికవర్గం సాంప్రదాయంగా కాంగ్రెస్ ఓటు బ్యాంక్. వారంతా 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యానికి అండగా నిలబడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వారు ఎదుర్కొంటున్న రాజకీయ అవమానాల గురించి చిరంజీవి ఏనాడైనా ఆలోచించారా? కాపులే కాదు..ప్రత్యామ్నాయ రాజకీయాలు ఆశించిన బిసిలు కూడా అధికార పార్టీ చెంతకు వెళ్ళలేని స్థితిలో ఉన్నారు. వారంతా మరింత కసితో 2014 ఎన్నికల నాటికి ప్రజారాజ్యం బలపడితే చూడాలనుకుంటున్నారు. కానీ బలపర్చే ఉద్దేశ్యం ప్రజారాజ్యం నాయకత్వానికి లేదని స్పష్టమైంది. ఒక వైపు టికెట్లు ఇచ్చినందుకు పార్టీకి డబ్బులిచ్చి మరో వైపు ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టుకుని ఆరిపోయిన వారంతా ప్రజారాజ్యం అధిపతులకు పూచికపుల్లలుగా కనపడటమే విషాదం. ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్ లను ఢీకొన్న ప్రజారాజ్యం అభ్యర్థుల్లో 90 శాతం మంది కొత్త వారే. ఎన్నికల్లో వారు పెట్టిన డబ్బు రాజకీయాల్లో సంపాదించింది కాదు. వ్యాపారాలు, పరిశ్రమల్లో సంపాదించిన డబ్బునే వారు ఎన్నికల్లో ఖర్చుపెట్టారు. అనేకమంది అప్పుల పాలయ్యారు. వారికేమీ చిరంజీవి నుంచి నష్టపరిహారం అక్కర్లేదు. వారి ఆర్థిక నష్టాలకూ, బాధలకూ, అవమానాలకు స్వాంతన చేకూర్చే ఒకే ఒక అంశం…ప్రజారాజ్యం ఏ స్ఫూర్తినయితే చెప్పిందో ఆ విలువలను కొనసాగించటం. కష్టాలనూ, నష్టాలను భరించి స్వార్థ రాహిత్యంతో, తెగువతో ప్రజారాజ్యం పార్టీని ముందుకు తీసుకెళ్లటం. ఇది చిరంజీవి చేయాల్సిన పని. ఆయన చేయాల్సిందిల్లా నమ్ముకున్న వారికీ, ప్రజలకు నమ్మకం కలిగించేలా వ్యవహరించటమే. మరి, చిరంజీవి ఆ పని చేస్తున్నారా? వీలైనన్ని ఎక్కువ ప్రయోజనాలు పొంది వీలైనంత తొందరగా బాక్సులు మూసేసే ఆరాటం తప్ప ప్రజారాజ్యంలో ఈషణ్మాత్రం కూడా ప్రజల దృక్కోణం లేకపోవటం విచారకరం.
- చిరంజీవి చేస్తున్న మరో చారిత్రక తప్పిదమేమిటంటే….రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయాలను నిలువునా పాతరవేయటం. సమీప భవిష్యత్ లో ప్రత్యామ్నాయ రాజకీయాల జోలికి ఎవరూ పోకుండా `ప్రజారాజ్యాన్ని` ఒక విఫల ప్రయోగంగా చూపించటం.
వరుసగా అయిదు సినిమాలు ప్లాఫ్ అయినా ఆరో సినిమాతో హిట్ కొట్టచ్చు. రాజకీయ పార్టీ అలా కాదు. నిరంతర శ్రమతోనూ, ప్రజల సమస్యలపై నిజాయితీగా, ధైర్యంగా పోరాడే నాయకత్వ లక్షణాలతోనూ ప్లాప్ అయిన పార్టీని కూడా సూపర్ హిట్ చేయచ్చు. అందుకు కావాల్సిందల్లా ఓపిక, సహనం, ధైర్యం, త్యాగం, నిజాయితీ, విశ్వసనీయత..అన్నిటికి మించి పోరాడే మనస్తత్వం. ఇవేమీ లేని చిరంజీవి గ్లామర్ నే పెట్టుబడిగా పెట్టి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకున్నారా? సాధ్యం కాకపోయే సరికి తన ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుని కాంగ్రెస్ తోక పార్టీగా ప్రజారాజ్యాన్ని మిగల్చానుకుంటున్నారా? ప్రజలు గమనిస్తున్నారు….చారిత్రక తప్పిదం చేసి చరిత్ర హీనతను మూటగట్టుకునే దుర్గతి మెగాస్టార్ కు పట్టకుండా ఉంటే బాగుండు..!