జార్ఖండ్ అల్లూరి…స్వాతంత్ర్య వీరుడు..స్వరాజ్య బాలుడు…బిర్సా ముండా జయంతి ఈ రోజు. 1875 నవంబర్ 15న అపుడు బీహార్ లో భాగంగా ఉన్న జార్ఖండ్ లో ముండా తెగకు చెందిన ఆదివాసీ కుటుంబంలో ఆయన జన్మించారు. బ్రిటీష్ పాలకుల ఉక్కుపాదాల కింద నలిగిపోతున్న అడవి తల్లి శోకాన్ని చూసి బిర్సా ముండా చలించిపోయారు. గిరిజన తండాలను ఏకం చేశారు. మన్యంలోని సాంప్రదాయక ఆయుధాలతో బ్రిటీష్ పాలకులను తమ ప్రాంతం నుంచి తరిమికొట్టేందుకు ఉద్యమించాడు. బ్రిటీష్ దొరలపై బిర్సా ముండా చేసిన యుద్ధం ఆ రోజుల్లో దేశంలోని మన్యం పోరాటాలకు స్ఫూర్తినిచ్చింది. అనేకమంది ముండాను ఆదర్శంగా చేసుకుని అటవీ ప్రాంతాల్లో బ్రిటీష్ పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడారు. భారత స్వతంత్ర్య పోరాట చరిత్రలో రియల్ హీరోగా పేరొందిన బిర్సా ముండా నూనుగు మీసాల ప్రాయంలో…25 ఏళ్ళ వయసులోనే అమరుడయ్యారు. ముండారు అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేసిన బ్రిటీష్ పోలీసులు అతన్ని రాంచి జైలులో ఉంచారు. ఆ జైలులోనే ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆదివాసుల అస్తిత్వం, తిరుగుబాటు చరిత్ర పటంలో చేతనా పతాకమై ఎగురుతున్న బిర్సా ముండా…నీకు వందనాలు.
-బిర్సా ముండా జయంతి ఈ రోజు…నవంబర్ 15, 1875