పికాసో చిత్రమా…ఎల్లోరా శిల్పమా…! ఈ పాట ఎక్కడో విన్నట్టుంది కదూ..! ప్రేమికుల ఊహా చిత్రం, ప్రాకృతిక సౌందర్యం, జీవన మాధుర్యం..మనిషి అంతరంగంలో రగిలే అగ్నిగుండం, ఎగిసిపడే కల్లోల కెరటం, కన్నీటి తరంగం, విధ్వంస వ్యూహం…ప్రపంచ రక్త చరిత్రలో తడిసి ముద్దయిన మానవ దేహం….20 వ శతాబ్ధంలో అన్నిటినీ ఒకే చోట బంధించి మానవాళికి కానుకగా సమర్పించిన అపురూప చిత్రకారుడు పాబ్లో పికాసో పుట్టిన రోజు నేడు.
20వ శతాబ్దపు చిత్రకళా విశ్వంభర ఉత్సవమూర్తి గా ఘన కీర్తి సాధించిన పికాసో 1881, అక్టోబరు 25న స్పెయిన్ లో జన్మించారు. చిత్ర కళను తండ్రి నుంచి వారసత్వంగా అభ్యసించారు. చిన్నతనంలోనే అబ్బురమైన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. శాన్ ఫెర్నాండో రాయల్ అకాడమీలో చిత్ర కళలో శిక్షణ పొందిన పికాసో 1895లో చెల్లెలి మరణంతో పసి ప్రాయంలోనే అంతర్వేదనకు గురయ్యారు. మనిషి వేదనను శోధించే పనిలో తనలోని భావాలన్నిటికీ చిత్రరూపం ఇచ్చారు. ప్రకృతి-మానవ సంబంధాల అంతర్ముఖాన్ని ఎంతో హృద్యంగా ఆవిష్కరించిన పికాసో కుంచె చిత్రకళలో ఎన్నో అద్భుతాలకు ప్రాణం పోసింది. చిత్రలేఖనంలో క్యూబిజంను ప్రవేశపెట్టి ఆధునిక చిత్రకళా ఆద్యుడిగా కూడా పికాసో ఘనకీర్తిని సాధించారు. అవిగ్ నాన్ వంటి తైలవర్ణ చిత్రాల రూపకర్త కూడా ఆయనే. చరిత్ర చీకటి కోణంలో దాగిన అట్టడుగున దాగిన కథలనూ, బాధా సర్పర ద్రష్టుల బాధలను పికాసో చిత్రాలు ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. 1937లో జర్మనీ, దాని మిత్రపక్ష దేశాలు గుయెర్నికా రాజధాని బాస్క్ ను బాంబుదాడులతో నేలమట్టం చేశాయి. దీనికి స్పందించి పికాసో గీసిన అపూరూప చిత్రం గుయెర్నికా .. ప్రపంచంలో బలవంతుల దౌర్జన్యాలకూ, నెత్తుటి గాయాలకూ సజీవరూపంగా నిలిచిపోయింది..అపురూప కళాఖండంగా పేరు పొందింది. 1962లో అంతర్జాతీయ లెనిన్ శాంతి బహుమతిని పికాసో అందుకున్నారు. 1973 ఏప్రిల్ 8న 91 ఏళ్ళ వయసులో పికాసో తుది శ్వాస విడిచారు. 2006 మే 4న పికాసో చిత్తరువు తొమ్మిదన్నర కోట్లకు అమ్ముడుపోయింది. అయితే, అంతకంటే విలువైన , వెలకట్టలేని చిత్రాలను ఆయన మానవాళికి అందించి వెళ్ళారు.