మైసూర్ పులి, బ్రిటీష్ పాలకుల వెనుచలి..టిప్పు సుల్తాన్ జయంతి ఈ రోజు.
కర్ణాటక రాష్టం కోలార్ జిల్లా దేవనహల్లిలో 1750, నవంబర్ 20న ఆయన జన్మించారు. అతని తండ్రి హైదర్ అలీ మైసూర్ రాజు. అతని తల్లి ఫాతిమా కడప కోట గవర్నరు మొయినుద్దీన్ కుమార్తె. మైసూర్ సంస్థానాన్ని ప్రజారంజకంగా పరిపాలిస్తున్న నేతగా అప్పటికే టిప్పు సుల్తాన్ తండ్రి హైదర్ అలీకి మంచి పేరుంది. ఫ్రెంచి పాలకుల కోరిక మేరకు మైసూర్ లో మొట్టమొదటి చర్చి నిర్మించిన ఆయన బ్రిటీష్ పాలకుల పెత్తనంపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. 1782లో జరిగిన రెండవ మైసూరు యుద్ధంలో తండ్రి హైదర్ అలీకి టిప్పు సుల్తాన్ వెన్నుదన్నుగా నిలిచి బ్రిటీష్ సైన్యాన్ని తరిమికొట్టారు. అదే సంవత్సరం హైదర్ అలీ మరణించటంలో మైసూర్ సంస్థానాధీశుడిగా టిప్పు సుల్తాన్ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఫ్రెంచి అధికారుల వద్ద టిప్పు సుల్తాన్ యుద్ధ విద్యలు అభ్యసించారు. 1766లో పదిహేనేళ్ళ వయసులోనే తండ్రితో కలిసి మొదటి మైసూరు యుద్ధంలో పాల్గొన్నారు. 16 ఏళ్ళ ప్రాయంలోనే అశ్వక దళాలకు సారధ్యం వహించారు. 1775-1779 మధ్య జరిగిన మొదటి ఆంగ్లో-మరాఠా యుద్ధంలో పాల్గొని తన వీరత్వాన్ని ప్రదర్శించారు. భారతదేశంలోని అనేక సంస్థానాలు బ్రిటీష్ ప్రభువుల కనుసన్నల్లో పాలన సాగించినా టిప్పు సుల్తాన్ మాత్రం ధీరోధాత్తుడై వారితో పోరాడారు. సామాన్య ప్రజలతో గొంతు కలిపి స్వతంత్ర్యం మా జన్మహక్కని పోరాటం చేశారు. బ్రిటీష్ పాలకులు మైసూరును కైవసం చేసుకోవాలని ఎన్నో కుయుక్తులు పన్నారు. బ్రిటీష్ సైన్యం దండెత్తి వచ్చినప్పుడల్లా టిప్పు సల్తాన్ వారిని సమర్ధవంతంగా తిప్పికొట్టారు. 1792లో జరిగిన యుద్ధంలో లోహపు కవచాలు ఉన్న రాకెట్ లను వదిలి బ్రిటీష్ సైన్నాన్ని గడగడ లాడించారు. ఆ తరహా రాకెట్లను ఆ తరువాత బ్రిటీష్ సైన్యం కూడా తయారుచేసి ప్రయోగించింది. మైసూరు సార్వభౌమాధికారం బ్రిటీష్ పరం కాకుండా జీవిత పర్యంతం వీరోచింగా పోరాడిన టిప్పు సల్తాన్ 1799లో శ్రీ రంగపట్నంలో జరిగిన యుద్ధంలో మరణించారు. టిప్పు సుల్తాన్ ఒకసారి ట్రావన్ కోర్ నాయర్లతో యుద్ధం చేస్తున్న సందర్భంగా తన ఖడ్గాన్ని పోగొట్టుకున్నారు. ఆ ఖడ్గాన్ని ఆర్కాట్ నవాబుకు ట్రావన్‌కోర్ రాజు బహుమతిగా ఇచ్చారు. ఆ తరువాత ఆ ఖడ్గం లండన్ కు చేరింది. 2004లో జరిగిన వేలంలో భారతీయ వ్యాపారవేత్త విజయ్ మాల్య దానిని కొని దాదాపు రెండు శతాబ్ధాల తరువాత మన దేశానికి తీసుకువచ్చారు.
-టిప్పుసుల్తాన్ జయంతి…నవంబర్ 20, 1750