
చిత్రకళా శిల్పం..కుంచె గీసిన జీవన చిత్రం…పాకాల తిరుమలరెడ్డి జయంతి ఈ రోజు. ప్రజల కష్టాలకూ, కన్నీళ్ళకూ, కేరింతలకు అద్దం పడుతూ జీవన సౌందర్యాన్నీ, విధ్వంస `చిత్రాన్ని` ఆవిష్కరించిన ఆయన కరీంనగర్ జిల్లా అన్నవరం గ్రామంలో 1915 జనవరి 4న జన్మించారు. పి.టి రెడ్డిగా అందరికీ పరిచయమైన ఆయన చిత్రకళా రంగానికి ఆరు దశాబ్దాల పాటు విశేష సేవలందించారు. అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. బొంబాయిలోని సర్ జె.జె స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ కాలేజీ నుంచి 1942లో చిత్రకళలో ఆయన డిప్లొమా చేశారు. చిత్రకళను కేవలం అకడమిక్ జ్ణానానికే పరిమితం చేయకుండా సమాజాన్ని నిరంతరం అధ్యయనం చేయటం ద్వారా అనేక అద్భుత చిత్రాలను అందించారు. మన దేశంలోని అన్ని ముఖ్య నగరాలతో పాటు ఆస్ట్రేలియా, బ్రిటన్, జపాన్, జర్మనీ తదితర దేశల్లో కూడా ఆయన చిత్రకళాప్రదర్శనలు నిర్వహించారు. తెలంగాణ పోరాటం ఉధృతమవుతున్న ఈ సమయంలో పి.టి రెడ్డిని జ్ఫాపకం చేసుకోవటం చారిత్రక అవసరం. పి.టి రెడ్డి కుంచె తెలంగాణ జీవన చిత్రాన్ని ఉన్నదున్నట్టుగా ఆవిష్కరించింది. తెలంగాణ ప్రజల ఆర్తినీ, ఆకాంక్షనీ, ఆకలినీ, ఆవేదనను పి.టి రెడ్డి తన `చిత్రాల` ద్వారా ప్రపంచానికి చూపించారు. బక్క చిక్కిన తెలంగాణ రైతు, తెలంగాణ పల్లెల్లో జీవన ఘర్షణ, తెలంగాణ పల్లెల్లోని మహిళల ఆవేదన, తెలంగాణ పోరాటం..ఇలా తెలంగాణ ఆత్మఘోషను వినిపించే అనేక చిత్రాలను ఆయన కుంచె ఆవిష్కరించింది. ఈ `రంగుల శిల్పి` ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లోని పరిణామాలనూ, మార్మిక, తాంత్రిక, శృంగార భావనలను తన చిత్రాల్లో పలికించారు. ప్రముఖ రచయిత్రి పి.యశోదారెడ్డి ఆయన భార్య. 1996 అక్టోబర్ 21 న పి.టి రెడ్డి భౌతికంగా మన నుంచి దూరమయ్యారు.