స్టీఫెన్ హాకింగ్…మనసా వాచా కర్మణా మానవీయతకు నిలువెత్తు నిదర్శనం. చరిత్రలో పొత్తిళ్ళలో భద్రంగా దాచుకోదగిన ఆణిముత్యం. జీవన యుద్ధంలో విధిని ఓడించిన వీరుడెవరిని అడిగితే…ఈ శతాబ్దంలో `స్టీఫెన్ హాకింగే`నని చెప్పవచ్చు. స్టిపెన్ హాకింగ్ గా ప్రసిద్ధుడయిన ఆయన పేరు స్టీఫెన్ విలియం హాకింగ్. ఆయన వ్యక్తి కాదు, వ్యవస్థ….చచ్చుపడిపోయిన కాళ్ళు…మూగబోయిన గొంతు…ఎటూ కదల్లేక చక్రాల కుర్చీలో గడిచిపోతున్న జీవితం…ఖగోళ శాస్త్ర పరిశోధనలో చరిత్ర సృష్టించిన మహోన్నత మానవ రూపం…చైతన్య జ్వలితం. మన కళ్ళెదుటే ఈ తరానికి నిలువెత్తు చైతన్య రూపమై, ఆదర్శమై కనిపిస్తున్న తేజోరూపం స్టీఫెన్ హాకింగ్. సరిగ్గా ఇదే రోజు 1942 జనవరి 8న ఇంగ్లాండులోని ఆక్స్ ఫర్డ్ లో స్టీఫెన్ ఆయన జన్మించారు. ఆయన తండ్రి లండన్ లో వైద్య శాస్త్ర పరిశోధకుడు. రెండవ ప్రపంచ యుద్ద సమయంలో స్టీఫెన్ తల్లిని ఆక్స్ ఫర్డ్ లోని సురక్షిత ప్రాంతానికి పంపించారు. అక్కడే స్టీఫెన్ జన్మించారు. భౌతిక శాస్త్రం డిగ్రీ అందుకున్న స్టీఫెన్ 1962లో కాస్మాలజి, జనరల్ రిలేటివిటీ పరిశోధనల కోసం ఆక్స్ ఫర్ద్ కి వెళ్ళారు. త్వరలోనే పి.హెచ్.డి అందుకోవాల్సిన సమయంలో స్టీఫెన్ ను తీవ్రమైన వ్యాధి వెంటాడింది. స్టీఫెన్ శరీరం ఏ పనికీ సహకరించలేదు. పరీక్షలు చేసిన వైద్య నిపుణులు స్టీఫెన్ కు భయంకరమైన `మోటార్ న్యూరాన్ వ్యాధి` సోకినట్టు నిర్ధారించారు. నరాలు, వెన్నపూసపై ప్రభావం చూపించే ఈ వ్యాధిని `ఆర్మీట్రోఫిక్ లేటరల్ స్కిలోరోసిస్` అని కూడా అంటారు. డాక్టరేట్ కూడా అందుకోకుండానే స్టీఫెన్ మరణించవచ్చని అందరూ భావించారు. అయితే, విధిని ఎదిరించారు. మొక్కవోని దీక్షతో, పట్టుదలతో పిహెచ్ డి పూర్తి చేయటమే కాక ఖగోళ శాస్త్రంలో అద్భుతమైన పరిశోధనలు చేసి ప్రపంచానికి అందించారు. ఆయన `కృష్ణ బిలాలు`పై పరిశోధన చేసి అనేక ఫలితాలను రాబట్టారు. `హాకింగ్స్ రేడియేషన్` గా పిలుస్తున్న కృష్ణ బిలాల రేడియేషన్ సిద్ధాంత కర్తగా స్టీఫెన్ హాకింగ్ ప్రపంచ వ్యాప్తంగా పేరు గడించారు. 1970 నుంచి ఆయన కృష్ణ బిలాలపై పరిశోధనలు చేశారు. జనరల్ రిలేటివిటి, క్వాంటమ్ థియరీ ఆధారంగా కృష్ణ బిలాలు కూడా `ధార్మిక శక్తి`ని కలిగి ఉంటాయని తన పరిశోధనల ద్వారా తెలియచెప్పారు. 1971 నుంచి `బిగ్ బ్యాంగ్`పై పరిశోధనలు ప్రారంభించిన ఆయన `కృష్ణ బిలాల`కు సంబంధించి ఎన్నో విషయాలను ఆవిష్కరించారు. 1984లో “ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్“ పుస్తకరచన ప్రారంభించారు. ఆ సమయంలో ఆయన కంప్యూటర్ సాయంతో మాట్లాడగలిగే పరికరాన్ని తయారు చేసుకున్నారు. దాని సాయంతోనే `ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్“ రచనను పూర్తి చేసి 1988లో ఆ పుస్తకాన్ని మార్కెట్ లోకి విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 40 భాషల్లో విడుదలైన ఆ పుస్తకం అమ్మకాల్లో రికార్డు సృష్టించింది. `కాలం కథ` పేరుతో తెలుగులో కూడా ఆ పుస్తకం విడుదలైంది. పదేళ్ళ తరువాత 1998 లో ఆ పుస్తకం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది. 1975 నుంచి 2006 వరకు ఆయన ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రఖ్యాత అవార్డులు అందుకున్నారు. 1975లో ఎడింటంగ్ అవార్డు అందుకున్న ఆయన ఆ తరువాత రాయల్ సొసైటీ హ్యుస్ మెడల్, ఆల్బర్ట్ ఐన్ స్టీన్ మెడల్, కంపానియన్ ఆఫ్ ఆనర్, రాయల్ సొసైటీ కాప్లీ వంటి అనేక ప్రసిద్ధ అవార్డులను అందుకున్నారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ఆచార్యునిగా సేవలందించిన స్టీఫెన్ హాకింగ్ గత ఏడాది పదవీ విరమణ చేశారు.