రాష్ట్ర రాజకీయ సంధ్యలో ఒక తార తళుక్కుమని నేటికి 28 సంవత్సరాలు. తెలుగుదేశం పార్టీ అనే ఆ `తార` అప్పటి నుంచి ఇప్పటిదాకా అధికార కక్ష్యలో ఉన్నా లేకపోయినా జగజ్జేయమానంగా వెలుగొందుతూనే ఉంది. 1982 మార్చి 29న నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం ప్రస్థానంపై ప్రత్యేక కథనం.
అంబరాన్ని చుంబించిన సంబరం..రాష్ట్ర రాజకీయ యవనికపై నందమూరి అందగాడి చిరునవ్వుల వదనం…“తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా“ అనే పిలుపు..వాన కురిసినట్టు, మెరుపు మెరిసినట్టు, మేఘమై గర్జించినట్టు, సింహం జూలు విదిల్చి ప్రతిమనిషిలో పౌరుషాగ్నిని ఆవాహం చేసినట్టు..ఏదో తెలియని చైతన్య జ్వలితం మేరునగమై కనిపిస్తున్న అపురూప అద్వితీయ రాజకీయ చారిత్రక సన్నివేశం….సరిగ్గా ఈ రోజుకు 28 ఏళ్ళ క్రితం తెలుగుదేశం ఆవిర్భవించిన ఆ `దృశ్యం` ఇప్పటికీ కళ్లముందు కదలాడుతున్న జ్ఞాపకం రాష్ట్ర ప్రజల హృదయాల్లో ఎప్పటికీ పదిలం.
చరిత్రలో భాగం కావటం వేరు..చరిత్ర సృష్టించటం వేరు…తెలుగుదేశం చరిత్ర సృష్టించింది. ఆ చరిత్ర కథానాయకుడు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ బిరుదాంకితుడైన నందమూరి తారక రామారావు. సినిమాల్లో రామారావు “టేక్, యాక్షన్“ లకే పరిమితమైన హీరో కాదు. అనేక సినిమాలను నిర్మించారు. దర్శకత్వం వహించారు. రాముడిగా, కృష్ణుడిగా ప్రజల హృదయాల్లో కొలువయ్యారు. పౌరాణిక, జానపద చిత్రాలెన్నెటిలోనే నటించిన ఆయన తన సినీ జీవిత గమనంలో `మన దేశం` మొదలుకుని `నాదేశం` వరకు ఎన్నో అభ్యుదయ పాత్రలు పోషించారు. పేదలకు అండగా నిలబడి అవినీతి పరులనూ, స్వార్థపరులను చెండాడే హీరో పాత్రల్లో నటించారు. తెరపై ప్రేరణ ఏదైనా….తెర వెనుక ప్రోత్సాహం ఎవరిదైనా రాజకీయాల్లోకి రావాలన్న ధృడ సంకల్పానికి వచ్చారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజాక్షేత్రంలోకి ఉరికారు. సినీ నటునిగా రామారావుకున్న విశేషమైన అభిమానంతో పాటు ఆనాటి రాజకీయ సందర్భం కూడా తెలుగుదేశంను భుజం తట్టి ప్రోత్సహించింది. ఎమర్జన్సీ చీకటి రోజుల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన జాతీయ పార్టీలనేకం అయిదారేళ్ళకే ప్రాభవం కోల్పోయాయి. ఇందిరాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పడి లేచిన కెరటంలా తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది. ఆ నేపథ్యంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీకగా ఆవిర్భవించిన తెలుగుదేశం రాజకీయ రూపు రేఖలను సమూలంగా మార్చేసింది. ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించి జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టించింది. పట్టుదల, శ్రమ, ఆటుపోట్లు ఎన్ని ఎదురయినా మడమ తిప్పని ఎన్టీరామారావు నైజం తెలుగుదేశంను తిరుగులేని రాజకీయ శక్తిగా మార్చింది. ఆయన జనం వద్దకు వెళ్ళారు. జనం ఆయన వెంట నడుస్తూ జేజేలు పలికారు. ఫలితంగా తెలుగుదేశం పార్టీ తొమ్మిదినెలల్లో అధికార పీఠాన్ని అధిష్టించి చరిత్ర నెలకొల్పింది. రాష్ట్రంలోనే కాదు..జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ కు ప్రత్నామ్నాయ రాజకీయ శక్తుల ఆవిర్భావానికి ప్రేరణగా నిలిచింది. నేషనల్ ఫ్రంట్ ఆవిర్భావంలో ఆయన కృషి ఎంతో ఉంది. అనేక విజయాలు, వైఫల్యాలను చవిచూసిన తెలుగుదేశంకు ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని ప్రోదిచేసిన పార్టీగా గుర్తింపు ఉంది. పార్టీ ఆవిర్భవించిన వెంటనే అధికారం దక్కించుకున్నా, 89 ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసినా, 94లో మళ్ళీ పాత ప్రాభవాన్ని దక్కించుకున్నా విజయాలకు పొంగిపోని, అపజయాలకు వెరవని నైజం రామారావుది. రెండు రూపాలయకు కిలో బియ్యం, మద్య నిషేధం ఆయన సాహసోపేతమైన ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు తార్కాణంగా నిలిచాయి. ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం పుట్టిన ఆ పార్టీ ఇప్పటికీ ప్రజల్లే మమేకమై ఉండటానికి నందమూరి తారక రామారావు నిర్మించిన పటిష్టమైన పునాదులే కారణమని నమ్మేవారు తెలుగుదేశంలో అనేకమంది ఉన్నారు.
————————
సుమారు మూడు దశాబ్దాల తెలుగుదేశం పార్టీ ప్రవాహశీలతను విశ్లేషించాల్సి వస్తే…ఎన్టీరామారావు ఆధ్వర్యంలోని తెలుగుదేశం, చంద్రబాబునాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం అని విభజించి పరిశీలింటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. లక్ష్మీ పార్వతిని ఎన్టీ రామారావు పెళ్ళి చేసుకోవటం, ఆ తరవాత పార్టీలో ఆమె ప్రమేయం పెరగటం…అప్పటికే పార్టీలో అధికార కేంద్రాలుగా ఉన్న ఆయన అల్లుళ్ళు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకూ, నారా చంద్రబాబునాయుడికి ఇబ్బందిగా మారింది. ఈ పరిణామాలు రామారావును పదవీ చ్యుతుడిని చేసే దాకా వెళ్లాయి. పార్టీలో రెండు భిన్న ధృవాలుగా ఉన్న తోడల్లుళ్ళు మామను గద్దె దించే విషయంలో మాత్రం ఒకటయ్యారు. ఆ తరువాత దగ్గుబాటిని పక్కకు త్రోసి తెలుగుదేశంలో చంద్రబాబునాయుడు గుత్తాధితప్యం వహించిన సంగతి అందరికీ తెలిసిందే. తాను పుట్టించి పెంచి పెద్ద చేసిన పార్టీ తన చేతి నుంచి జారిపోవటం, ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాల్సి రావటం రామారావును తీవ్రమైన మానసిక వేదనకు గురి చేసింది. కొద్ది కాలానికే ఆయన మరణించారు. ఆ తరువాత తెలుగుదేశం పూర్తిస్థాయిలో చంద్రబాబునాయుడి దేశంగా మారిపోయింది. పార్టీపై తన ముద్ర మాత్రమే ఉండేలా చంద్రబాబునాయుడు చేసిన కృషి బాగానే ఫలించింది. ఫలితంగా వెన్నుపోటు విమర్శలను ఎదుర్కొంటూ కూడా 1999 ఎన్నికల్లో పార్టీని విజయపథంలో దూసుకువెళ్ళేలా చేయగలిగి మళ్ళీ ముఖ్యమంత్రి కాగలిగారు. “నూతన ఆర్థిక విధానాలు, ప్రపంచ బ్యాంకు ఆదేశాలు, ఆర్థిక సంస్కరణల అమలు, కంప్యూటరీకరణ, ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ…“ వీటన్నిటిని మనసా వాచా నమ్మి ఆచరణలో పెట్టే సమర్ధుడైన ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు మన రాష్ట్రంలో, దేశంలో కాదు…ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. రెండు రూపాయలకు కిలో బియ్యం, మద్య నిషేధాలను రామారావు అమలుపరిస్తే వాటిని దశలవారీగా ఎత్తివేసిన రాజకీయ సాహసి చంద్రబాబు. ఎన్టీరామారావుకూ, చంద్రబాబునాయుడుల స్వభావంలోనూ, పాలనలో ఉన్న మౌలికమైన తేడాకు ఇంతకు మించిన విశ్లేషణ అవసరం లేదు. చంద్రబాబు పాలనలో నగరాల్లో రహదారులు విస్తరించాయి. ఫ్లై ఓవర్లు వచ్చాయి. ఐ.టి పాలపొంగులా పెల్లుబికింది. సంస్కరణల అమలుకు ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ అడ్రస్ గా మారింది. చంద్రబాబుకు అంతర్జాతీయ ప్రశంసలు వచ్చాయి. పవర్ పాయింట్ ప్రజంటేషన్ లో బాబుకు మించిన నిపుణుడు రాజకీయాల్లో లేడన్న ప్రచారం వచ్చింది. చంద్రబాబు మదిలో మెరిసిన భవిష్య ప్రణాళిక `విజన్ 2020` డాక్యుమెంట్ విడుదలైంది. కానీ, ప్రజాక్షేత్రం బాబు `విజన్` చెరిపేసింది. 2004లో బాబుకు ఓటమి మిగిలింది. ప్లై ఓవర్లు ఎన్ని నిర్మించామని కాదు…వికటాట్టహాసం చేస్తున్న కరువును ఆపేదెలా, సేద్యం చేసిన పొలాల్లో పురుగుమందు తాగి చనిపోతున్న రైతుల ఆత్మహత్యలను నివారించేదెలా, ఆకలిచావుల కేకలు లేకుండా చేసేదెలా..!? ఈ పరిష్కారాలేవీ బాబు మనసా వాచా నమ్మిన చంద్రబాబు `విజన్`లో లేకపోవటమే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. 1989 లో ఓటమి చవిచూపిన రామారావు పట్టుదలతో ప్రజల్లోకి వెళ్ళి అధికార పక్షాన్ని ఎండగట్టి 1994లో తిరిగి అధికారంలోకి రాగలిగారు. చంద్రబాబు మాత్రం 2004లో చవిచూసిన ఓటమినే 2009లోనూ ఎదుర్కొన్నారు. ఫలితంగా ఆరేళ్ళుగా తెలుగుదేశం అధికారానికి దూరంగా ఉంది. మరో నాలుగేళ్ళు ఇలాగో ఉండబోతుంది. ఈ పరిణామ క్రమాన్ని విశ్లేషిస్తూ చంద్రబాబునాయుడి నాయకత్వ లక్షణాలను ప్రశంసించే వారితో పాటు ఆయన వైఖరి వల్లనే పార్టీకి ఈ దుస్థితి పట్టిందని తీవ్రస్థాయిలో విమర్శించే వారు కూడా అంతకన్నా ఎక్కువగానే ఉన్నారు.