నాన్నంటే ఆకాశం. వెన్నెలై ప్రేమను ప్రసరించినా, ఉరుమై కోపాన్ని ప్రదర్శించినా నాన్నంటే నాన్నే…. ఎదుగుతున్న బిడ్డల వైపు నాన్న క్రీగంట చూస్తాడు. నా `తల్లీ కదా…నా తండ్రి కదా….నిన్న మొన్నటి దాకా నా గుండెలపై ఆడుకున్న పసి మొగ్గలు కదా ` అనుకుని మనసారా మురిసిపోతాడు. మన చిట్టి చేతులు పట్టుకుని నడిపించినవాడు…దారి చూపించినవాడు….మన బుజ్జి కాళ్ళతో గుండెలపై తంతుంటే తనివితీరా ముద్దాడినవాడు…. నాన్న కెన్నో కష్టాలు….తినీ తినక పైసా పైసా మన కోసమే కూడపెట్టి బిడ్డలు బాగా ఎదగాలనీ, అభివృద్ధిలోకి రావాలని కలలు కంటాడు….నడిచే దారిలో, నీడలో బిడ్డల భవిష్యత్తును కలలుగనే అమృతమూర్తి నాన్న. `ఫాదర్….డాడీ…నాన్న…తండ్రి` పేరేదైతేనేం…నాన్నొక నిర్మల నిశ్చల నిలువెత్తు చైతన్యరూపం…దీప శిఖా జ్వలితం…. ప్రేమకు మారు పేరు నాన్న….బిడ్డలను గుండెలకద్దుకుని ముద్దాడే నులివెచ్చని స్పర్శా సంగీతం…శ్రావణమేఘం…సంధ్యారాగం నాన్న. అన్నీ మనమై బతుకుతున్న వాడు…..తనకంటూ ఏమీ మిగిల్చుకోనివాడు…నిస్వార్థ జీవి నాన్న. నాన్నొక నది. జీవనది….ఎప్పటికీ ఎండిపోని సుజల స్రవంతి…. మన అడుగుల్లో అడుగై మన చుట్టూ పరిభ్రమించే కాంతి మూర్తి నాన్న… ఫాదర్స్ డే సందర్భంగా నాన్నలందరికీ బిడ్డల తరపున శుభాకాంక్షలు.
-ఫాదర్స్ డే సందర్భంగా నిన్న (ఆదివారం జూన్ 20, 2010) రాసిన ఒక ఎమోషన్ ప్రోజ్ … ఒక టీవీ చానల్ లో కూడా ప్రసారమైంది.